రికార్డు క్రియేట్ చేసిన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌

బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్‌లే సోషల్‌ మీడియాలో రికార్డు మోత మోగించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచిన నిమిషాల వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్స్‌ మైలురాయిని ఛేదించారు.దీంతో అతివేగంగా గరిష్ట ఫాలోవర్స్‌ను సాధించిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌గా వీరి ఖాతా గిన్నిస్‌ రికార్డుల కెక్కింది.

ఏప్రిల్‌ 2వ తేదీన ససెక్స్‌ రాయల్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా మిలియన్లకొద్దీ ఫాలోవర్లు, లైక్‌లతో దూసుకుపోతోంది. మొదటి 5గంటల్లో పది లక్షమంది ఫాలోవర్స్‌ను నమోదు చేసింది. అనంతరం ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇప్పటికే 9లక్షలకు పైగా లైక్స్‌ను పొందింది.

ప్రస్తుతం 2. 6 మిలియన్లతో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. అతి తక్కువ సంయంలో మిలియన్ల ఫోలోవర్స్‌ సాధించిన రికార్డు పోప్‌ ఫాన్సిస్‌ పేరుతో వుంది. అనంతరం దక్షిణ కొరియా పాప్‌ సింగర్‌ కాంగ్‌ డేనియల్‌ (11గంటలు) ఈ ఘనతను సాధించారు.

ప్రిన్సెస్ యుజెనీ మొదలుకొని డేవిడ్ బెక్‌హాం, బ్లేక్ లైవ్లీ, గ్వినేత్ పాల్ట్రో, మిండీ కాలింగ్‌ లాంటి సెలబ్రిటీలు వీరి ఫాలోవర్స్‌గా ఉన్నారు. ఇంకా మేఘన్ క్లోజ్‌ ఫ్రెండ్‌, నటి ప్రియాంకా చోప్రా, టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, జెస్సికా ముల్రనీ ఈ ఖాతాలోని మొదటి అనుచరుల జాబితాలో ఉన్నారు. కాగా కేవలం 23మంది ఫాలోవర్స్‌ మాత్రమే ససెక్స్‌రాయల్‌ అకౌంట్‌లో ఉన్నారు. కాగా మరో నెలరోజుల్లోనే మేఘన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఇక పుట్టిన బిడ్డ ఫోటో పోస్ట్‌ చేస్తే ఇంకెన్ని రికార్డు ల మోత మోగనుందోనని భావిస్తున్నారు.