ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రికార్డు సృష్టించిన రైనా

ఇప్పటికే ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులను పూర్తి చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా.. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం చెపాక్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్న రైనా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రైనా రికార్డు సృష్టించాడు.

రైనా తర్వాత స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌ (84), రోహిత్‌శర్మ (82 ), పొలార్డ్‌(80), కోహ్లి(72)లు ఉన్నారు. తన కెరీర్‌లో 189వ ఐపీఎల్‌ మ్యాచ్‌  ఆడిన రైనా 37 బంతుల్లో 59 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.