ఐదో వన్డేలో అర్ధశతకం సాధించిన రోహిత్ శర్మ

భారత విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఐదో వన్డేలో అర్ధశతకం సాధించిన రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4×4) వన్డే కెరీర్‌లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డ్‌ని 200 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ అందుకోగా.. విరాట్ కోహ్లీ కేవలం 175 ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకోవడం విశేషం.

భారత్ తరఫున ఇప్పటి వరకూ మొత్తం 9 మంది క్రికెటర్లు వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ రికార్డ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తన వేగంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 8 వేల పరుగులు మైలురాయిని అందుకున్న క్రికెటర్ల రికార్డ్‌ల్లోనూ కోహ్లీదే అగ్రస్థానం. కోహ్లీ 175 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. దక్షిణాఫ్రికా మాజీ హిట్టర్ ఏబీ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్‌ల్లో ఆ మార్క్‌ని చేరుకున్నాడు. ఇక మూడో స్థానంలో ఇప్పటి వరకూ 200 ఇన్నింగ్స్‌లతో సౌరవ్ గంగూలీ ఉండగా.. తాజాగా అతని సరసన రోహిత్ శర్మ కూడా చేరాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన కోహ్లీసేన 237 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 35 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న కంగారూలు.. సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకున్నారు