శ్రీకాకుళం జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై ఇసుక మాఫియా దాడి

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతోంది. ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ ఉద్యోగులపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైర వద్ద ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకునేందుకు వెళ్లిన గ్రామ రెవెన్యూ అధికారులపై మంగళవారం అర్థరాత్రి ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు గాయాలపాలవ్వగా.. మరో ఇద్దరు వీఆర్వోలు అక్కడ నుంచి పరుగులు తీశారు.

తహసీల్దార్‌ కె.వేణుగోపాల్‌, ఎస్సై చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గ్రామస్థులతో మాట్లాడారు. అధికారులపై దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గాయపడిన వీఆర్వోలను చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఆర్వోలను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ చక్రధరబాబు బుధవారం ఉదయం పరామర్శించారు. ఈ ఘటనపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, నిందితులను వదలబోమని హెచ్చరించారు.