ఐపీల్ లోకి మల్లి రీఎంట్రీ ఇవ్వబోతున్న సౌరవ్ గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఐపీఎల్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఈ మెగా టోర్నీలో అభిమానుల్ని అలరించిన గంగూలీ.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఈ ఏడాది తన వ్యూహాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) జట్టుని నిర్దేశించనున్నాడు. గంగూలీని తమ జట్టు సలహాదారుడిగా నియమించుకున్నట్లు ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. ఇప్పటికే టీమ్ హెడ్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్న విషయం తెలిసిందే.

‘సౌరవ్ గంగూలీ‌కి క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. అతని దూకుడు, వెన్నుచూపని ధైర్యం, తెగింపు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులోనూ నింపాలని ఆశిస్తున్నాం’ అని ఢిల్లీ ఫ్రాంఛైజీ వెల్లడించింది. ఈ నియామకంపై గంగూలీ కూడా స్పందించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బోర్డులో చేరడం ఆనందంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. కొన్నాళ్లు క్రికెట్ వ్యవహారాలకి దూరంగా ఉన్న గంగూలీ.. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.

మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభంకానుంగా.. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్‌తో పాటు రిషబ్ పంత్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్ తదితర యువ క్రికెటర్లు ఉన్న విషయం తెలిసిందే. మార్చి 24న ముంబయి ఇండియన్స్‌తో వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి మ్యాచ్‌ను ఆడనుంది.