బీహార్ లో కుదిరిన సీట్ల పొత్తు

బిహార్‌లో మహాకూటమిలోని పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల కోసం సీట్ల పంపిణీ పూర్తయింది. ఈ రాష్ట్రంలో మొత్తం 40 సీట్లుండగా ఆర్జేడీకి 20 సీట్లు దక్కాయి.

కాంగ్రెస్‌ 9 స్థానాల్లో పోటీ చేయనుంది. ఉపేంద్ర కూష్వాహకు చెందిన ఆర్‌ఎల్‌ఎస్పీ ఐదు స్థానాల్లో, జతిన్‌ రాం మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం మూడు చోట్ల, ముకేశ్‌ సాహ్నీకి చెందిన వీఐపీ మూడు సీట్లలో పోటీ చేయనుంది. అయితే ఆర్జేడీ తమకు దక్కిన 20 సీట్ల నుంచి అరా నియోజకవర్గాన్ని సీపీఐ(ఎంఎల్‌)కు వదిలిపెట్టింది. సీట్ల కేటాయింపు వివరాలను బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు. దర్భంగా నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న కీర్తి ఆజాద్‌ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. దర్భంగా టికెట్‌ను కీర్తికే ఇస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు.∙ఇప్పుడు ఆ స్థానం నుంచి ఆర్జేడీ అబ్దుల్‌ బరీ సిద్దిఖీని బరిలోకి దింపుతోంది. ప్రధానంగా ఈ కారణంగానే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

పాటలీపుత్ర నుంచి మిసా భారతి
పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతి పోటీ చేయనున్నారు. దర్భంగా నుంచి అబ్దుల్‌ బరీ సిద్దిఖీని ఆర్జీడీ పోటీకి దింపుతుండటం అటు కాంగ్రెస్‌తోపాటు ఇటు ఆర్జేడీ సీనియర్‌ నేత అష్రఫ్‌ ఫాత్మికి కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. అష్రఫ్‌ ఫాత్మి ఆ స్థానం నుంచి గతంలో చాలా సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. బెగుసరాయ్‌ నియోజకవర్గంలో 2014లో పోటీచేసి ఓడిపోయిన తన్వీర్‌ హస్సన్‌నే ఆర్జేడీ మళ్లీ బరిలోకి దింపింది.