ప్యాసింజర్‌ రైలులో షార్ట్‌ సర్య్కూట్‌

ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న ప్యాసింజర్‌ రైలులో షార్ట్‌ సర్య్కూట్‌ కావడంతో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా వేజెండ్ల రైల్వే స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..వేజెండ్ల రైల్వేస్టేషన్‌కు చేరుకొన్న ప్యాసింజర్‌ రైలు నుంచి ప్రయాణికులు దిగుతుండగా పుట్‌బోర్డు వద్ద ఉన్న గ్రిల్స్‌కు విద్యుత్‌ సరఫరా అయింది.

దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫాంపైకి దూకేశారు. విషయం తెలుసుకున్న ప్యాసింజర్‌ రైల్వే గార్డు అప్రమత్తమై రైలులోని విద్యుత్‌ సరఫరాను నిలిపేయడంతో పెనుప్రమాదం తప్పింది. గాయపడిన ప్రయాణికులను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామాలతో ప్యాసింజర్ రైలును 2 గంటలపాటు స్టేషన్‌లోనే నిలిపేశారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వేశాఖకు చెందిన సాంకేతిక నిపుణులు, అధికారులు పరిశీలిస్తున్నారు.