శ్రీలంకలో పరిస్థితులు సాధారణ స్థితికి రానున్నాయని వెల్లడించిన భద్రతాసిబ్బంది

శ్రీలంక చోటుచేసుకున్న ఘోరమైన బాంబు దాడులతో సంబంధం ఉన్నవారిని హతమార్చడం లేదా అరెస్ట్ చేయడంతో దేశం ఇప్పుడు సురక్షితంగా ఉందని అక్కడి భద్రతా సిబ్బంది వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు సాధారణ స్థితికి రానున్నాయని వారు స్పష్టం చేశారు.

త్రివిధ దళ కమాండర్లు, పోలీసు చీఫ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేకమైన భద్రతా ప్రణాళిక, తగిన చర్యల ద్వారా బాంబు దాడులతో దద్దరిల్లిన దేశాన్ని ప్రస్తుతం సురక్షిత స్థితికి తీసుకురాగలిగామని తెలిపారు. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేశామని, హతమార్చామని ఇన్‌స్పెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీసు(ఐజీపీ) వెల్లడించారు. ‘ఉగ్రసంస్థల వద్ద ఉన్న అన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం. ఎన్‌టీజే ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న దాదాపు ప్రతిఒక్కరిని గుర్తించి, అరెస్ట్ చేశాం.

ఘర్షణల్లో బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు తీసుకున్నామని సంతోషంగా వెల్లడిస్తున్నాం’ అని ఐజీపీ తెలిపారు. అయితే ఇప్పటికే 73 మందిని అరెస్టు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఎన్‌టీజేకి చెందిన రూ.140 మిలియన్ల నగదు, రూ.7 బిలియన్‌ ఆస్తులను సీఐడీ గుర్తించిందని ఆయన తెలియజేశారు. ఏప్రిల్ 21న ఈస్టర్ ఆదివారం రోజున శ్రీలంకలో పలు చర్చిలు, హోటళ్లలో ఆత్మాహుతి పేలుళ్లు సంభవించడంతో సుమారు 257 మంది మరణించారు.