ఓట్ల లెక్కింపుపై అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లోని గోల్డెన్‌జూబ్లీ హాలులో జిల్లా ఎన్నికల అధికారి ముత్యాలరాజు ఆధ్వర్యంలో రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌వోలు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం వారందరికీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక వీఆర్‌ కళాశాలలో ప్రాక్టికల్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. స్ట్రాంగ్‌ రూము నుంచి డమ్మీ ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు తీసుకొచ్చి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా చేయాలో నిపుణులు ఎన్నికల సిబ్బందికి తెలియజేశారు. సాధారణ ఓట్ల లెక్కింపులాగే అక్కడ ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, సిబ్బందికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీరితో పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్‌ ఏజెంట్లకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా గ్యాలరీలా ఏర్పాటు చేశారు.

ముత్యాలరాజు ఆ కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తనిఖీ చేశారు. ముందుగా గోల్డెన్‌జూబ్లీ హాలులో జరిగిన శిక్షణలో తెలుసుకున్న అంశాలను మరోసారి నిపుణులు తెలియజేశారు. దీని ద్వారా ఆర్‌వోలు, ఏఆర్‌వోలు, ఇతర సాంకేతిక సిబ్బందికి 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో ఇబ్బందులుండవని ఈ సందర్భంగా ముత్యాలరాజు తెలిపారు. ఈ శిక్షణ అంతా రహస్యంగా ఇచ్చారు. ఇతరులను ఎవర్నీ లోపలకు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. ఈసీ నిబంధనల మేరకు ఈ ప్రాక్టికల్‌ శిక్షణను రహస్యంగా నిర్వహించాల్సి ఉండటంతో మీడియా, పత్రికా ప్రతినిధులనూ అనుమతించలేదు. ఆర్‌వోలు వెట్రిసెల్వి, శ్రీధర్‌, ఆనంద్‌, ఇతర నియోజకవర్గాల ఆర్‌వోలు, ఏఆర్‌వోలు పాల్గొన్నారు.