డీసెట్‌ పరీక్ష తేదీ మార్చాలని అభ్యర్థిస్తున్న విద్యార్థులు

ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహిస్తే ఏ పరీక్షకు హాజరుకావాలో తెలియని పరిస్థితి నెలకొంది విద్యార్థులకు. ఇంటర్‌ అనుబంధ పరీక్షలు జిల్లాలో మంగళవారం నుంచి జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించేలా ఇంటర్‌ విద్యామండలి కాల పట్టికను రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఈడీ కళాశాలల్లో ప్రవేశం కోసం ‘డీసెట్‌ 2019’ ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ద్వితీయ సంవత్సరం చదివిన విద్యార్థులు డీసెట్‌కు హాజరయ్యేందుకు అర్హులుగా నిర్ణయించారు.

ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డీసెట్‌కు హాజరయ్యేందుకు ఎంటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంటర్‌ వార్షిక పరీక్షలు రాసి అనుత్తీర్ణులైన విద్యార్థులు, వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులకంటే ఎక్కువ మార్కులు పొందడం కోసం ఇంటర్‌ అనుబంధ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రం ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే డీసెట్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడింది. ెఇంటర్‌ అనుబంధ పరీక్షలు, డీసెట్‌ పరీక్షలను నిర్వహించే తేదీలు, పరీక్షల వేళలు కూడా దాదాపు ఒకటే కావడంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే విద్యార్థులు హాజరుకావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో డీసెట్‌ పరీక్షల నిర్వహణ తేదీలను మార్చాలని అభ్యర్థిస్తున్నారు.