రూ. 10కోట్లు జమ చేసి విదేశాలకు వెళ్లొచ్చు

ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు మరోసారి అనుమతినిచ్చింది. అయితే గతంలో మాదిరిగానే ఈసారి కూడా షరతులు విధించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో మరో రూ. 10కోట్లు జమ చేసి కార్తీ విదేశాలకు వెళ్లొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

టెన్నిస్‌ అసోసియేషన్‌ సమావేశాల నిమిత్తం ఈ నెలలో అమెరికా, జర్మనీ, స్పెయిన్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కార్తీ చిదంబరం సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆయన వినతిని షరతులతో అంగీకరించింది. అయితే గతంలో కార్తీ రూ. 10కోట్లు జమ చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పగా.. ‘మరో రూ. 10కోట్లు ఇవ్వండి. ఈ డబ్బు చెల్లించడంలో మీ క్లయింట్‌కు ఎలాంటి ఇబ్బంది లేదుగా’ అని జస్టిస్‌ గొగొయ్‌ అన్నారు.

కాగా.. గతంలోనూ కార్తీ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ఇవే షరతులు పెట్టింది. అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్ల కోసం ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొద్ది రోజుల పాటు ఫ్రాన్స్‌, స్పెయిన్‌, యూకే, జర్మనీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది జనవరిలో కార్తీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు అనుమతినిచ్చిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయాలని స్పష్టం చేసింది. అంతేగాక.. విచారణకు సహకరిస్తానని, భారత్‌కు తిరిగి వస్తానని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఆదేశించింది.

మరోవైపు తమిళనాడులోని శివగంగ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కార్తీ పోటీ చేశారు. ఈ స్థానానికి ఏప్రిల్‌ 18న ఎన్నికలు జరిగాయి.