తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెంచి వెళ్లిపోయిన ‘ఫొని’

‘ఫొని’ పెను తుపాను తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెంచేసి వెళ్లిపోయింది. ఉత్తరాంధ్ర మినహా చాలా జిల్లాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు సగటున 3 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ విభాగం వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం మరో 2, 3 రోజులపాటు కొనసాగుతుందని హెచ్చరించింది.

‘ఫొని’ ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించినపుడు ఇక్కడున్న తేమనంతా లాగేసుకుంది. ఫలితంగా తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో చాలాచోట్ల 40 డిగ్రీల దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కావలిలో గరిష్ఠంగా 44.6 డిగ్రీలు నమోదైంది. తీరప్రాంతాల్లోనూ వేడి పెరిగింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వడగాలుల ప్రభావం మొదలైంది. తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ వడగాల్పుల ప్రభావం ఉంది. తుపాను ప్రభావం వల్ల విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక్కడ శనివారం నుంచి వడగాలుల తీవ్రత పెరగనుంది.

రుతుపవనాలపై ప్రభావం ఉండదు
‘ఫొని’ ప్రభావం రాబోయే నైరుతి రుతుపవనాల మీద ఏమాత్రం ఉండబోదని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రుతుపవనాలు రావడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఈ తుపాను ప్రభావం ఉండే అవకాశమే లేదని, ఇదివరకు సూచించిదాన్ని బట్టి సకాలంలో రుతుపవనాలు వస్తాయని వివరించారు.