బలహీన పార్టీ కోసం ఎదురు చూస్తున్న ఉగ్రవాద ఫ్యాక్టరీలు

‘కాంగ్రెస్‌ వాళ్లకు మీ మోదీ అంటే చాలా ద్వేషం ఉంది. ఎంత ద్వేషం అంటే మోదీని చంపేయాలని కూడా వాళ్లు కలలుగంటుంటారు. కానీ భారత ప్రజలు నాకోసం పోరాడుతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్‌ వాళ్లు మర్చిపోతున్నారు’ అని మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని నీటి సమస్యకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమనీ, డిసెంబర్‌లో అధికారం చేపట్టినా నీటి ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టడం లేదని ఆరోపించారు.

అలాగే ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని గోసైన్‌గంజ్‌లోనూ మోదీ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదాల్లో ఉగ్రవాదం కూడా ఒకటనీ, పొరుగుదేశంలో ఉన్న ఉగ్రవాద ఫ్యాక్టరీలు మన దేశంలో బలహీన ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వపు కొత్త భారత దేశంలో ఉగ్రవాదులను వారి స్థావరాల్లో, సరిహద్దులకు అవతల, ఇవతల అనే తేడా లేకుండా సమర్థంగా ఎదుర్కొంటున్నామని మోదీ అక్కడ మాట్లాడుతూ అన్నారు.

శ్రీలంకలో ఈస్టర్‌ పండుగనాడు జరిగిన పేలుళ్లను ప్రస్తావిస్తూ ‘ఇటీవల శ్రీలంకలో ఏం జరిగిందో మనం చూశాం. 2014కు ముందు మనదేశంలోనూ ఇలాంటి పరిస్థితే ఉండేది. అయోధ్యలో పేలుళ్లను మనం మర్చిపోగలమా? దేశంలో ఏదోమూల ప్రతీరోజు ఉగ్రవాదుల దాడులు జరిగేవి. కానీ గత ఐదేళ్ల మా పాలనలో అలాంటి ఉగ్రఘాతుకాల వార్తలు ఆగిపోయాయి. దీని అర్థం ఉగ్రవాదం ఆగిపోయిందని కాదు. ఉగ్రవాద ఫ్యాక్టరీలు పొరుగుదేశంలో పనిచేస్తున్నాయి. అక్కడ వాళ్లకు అదో పరిశ్రమ, అది వారి వ్యాపారం. మన దేశంలో బలహీన ప్రభుత్వం కోసం వారి కాచుకుని కూర్చున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు’ అని మోదీ అన్నారు.