న్యూ ఇయర్ జరుపుకుంటున్నందుకు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. గురువారం జరిగిన ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 23 మందికి గాయాలయ్యాయని ఆఫ్ఘాన్‌ ప్రభుత్వ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పలు ప్రాంతాల్లో పెర్షియన్‌ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సందర్బంగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ వేడుకలు అక్కడి మత సంప్రదాయాలకు వ్యతిరేకమనే భావజాలం కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

పశ్చిమ కాబూల్‌లోని కర్త్‌ ఎ సాఖి ప్రార్ధన మందిరం సమీపంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. కొందరు మోర్టారు బాంబఉలతో దాడులకు దిగారని ఆఫ్ఘాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చినట్లు చెప్పింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. గతంలో షియా ముస్లింలపై ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రసంస్థ దాడులు జరిపింది. తాజా దాడులు కూడా ఆ సంస్థే జరిపినట్లు తెలుస్తుంది. మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం.