ఇజ్రాయిల్‌ వ్యతిరేక ర్యాలీలను రద్దు చేసిన యునైటెడ్ నేషన్ కమిషన్

గాజాస్ట్రిప్‌ తూర్పు ప్రాంతంలో ప్రతి వారాంతంలో నిర్వహిస్తున్న ఇజ్రాయిల్‌ వ్యతిరేక ర్యాలీలను రద్దు చేసి ఇజ్రాయిల్‌తో సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించినట్లు ది హయ్యెస్ట్‌ కమిషన్‌ ఆఫ్‌ది మార్చ్‌ ఆఫ్‌ రిటర్న్‌ అండ్‌ బ్రేకింగ్‌ ది సీజ్‌ శుక్రవారం ప్రకటించింది. గాజాస్ట్రిప్‌లోని ఇజ్రాయిల్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు పెరుగుతున్న కారణంగా ఈ ర్యాలీలను వాయిదా వేస్తున్నట్లు కమిషన్‌ మీడియాకు ఇ-మెయిల్‌లో పంపిన ఒక ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం నిర్వహించే ఇజ్రాయిల్‌ వ్యతిరేక ర్యాలీలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాయిదా వేయాలని నిర్ణయించామని, ముఖ్యంగా పాలస్తీనా ప్రజల సంక్షేమం కోసం, లాండ్‌ డే, ఇజ్రాయిల్‌ వ్యతిరేక ప్రదర్శన వార్షికోత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్‌ తన ప్రకటనలో వివరించింది. వాయిదా వేసినంత మాత్రాన ఇజ్రాయిల్‌ వ్యతిరేక ప్రదర్శనలను శాశ్వతంగా రద్దు చేసినట్లు కాదని, త్వరలోనే పునఃప్రారంభమయ్యే ఈ ర్యాలీలు తమ లక్ష్యాలను ముఖ్యంగా అన్యాయమైన ఇజ్రాయిలీ దిగ్బంధానికి తెరదించే వరకూ కొనసాగుతాయని కమిషన్‌ వెల్ల డించింది. గత ఏడాది మార్చి 30న ప్రారంభించిన ఈ నిరసన ప్రదర్శ నలు, ర్యాలీలను కమిషన్‌ వాయిదా వేయటం ఇదే తొలిసారి కావటం విశేషం.
ఇజ్రాయిల్‌ విమాన దాడులు
అంతకు ముందు గురువారం రాత్రి ఇజ్రాయిల్‌ యుద్ద విమానాలు గాజాస్ట్రిప్‌లోని సైనిక స్థావరాలపై ఉధృత స్థాయిలో దాడులు చేశాయని భద్రతాధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇజ్రాయిలీ డ్రోన్‌లు, హెలీకాప్టర్లు, ఎఫ్‌-16లు గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడ్డాయని ప్రత్యక్షసాక్షులు వివరించారు. ఈ దాడుల సమయంలో గాజా స్ట్రిప్‌ దక్షిణ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన పేలుళ్లు జరిగాయని, అయితే ఇందులో ఎవరూ గాయపడినట్లు సమాచారం అందలేదని అధికారులు వివరించారు.