తాలిబన్లతో కుదరని ఒప్పందం

అమెరికా, రష్యా తదితర ప్రాంతీయ దేశాల ప్రతినిధులతో చర్చలు ఇంకా జరుగుతున్నాయనీ ఇంతవరకు చర్చలు ముగిసి ఒప్పందం కుదురలేదని ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్‌ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ఫలించినట్లైతే అమెరికాతో తాలిబన్లకు గల విభేదాలు సమసిపోతాయని తాలిబన్‌ వర్గాలను పేర్కొంటూ డాన్‌ న్యూస్‌ టెలివిజన్‌ వార్తను అందించింది. ”బలవంతంగా యుద్ధం చేస్తున్నాం. మా శత్రువులు మాపైన దాడి చేస్తున్నారు. అందువల్ల మేం కూడా వారిని తిప్పికొడతున్నాం” అని తాలిబన్ల ప్రతినిధి జబివుల్లా ముజాహిద్‌ చెప్పినట్టుగా టెలివిజన్‌ వెల్లడించింది. ఆఫ్ఘన్‌ దేశంలో దాదాపు సగం ప్రాంతం ఇప్పటికీ తాలిబన్ల అధీనంలో ఉన్నది.

అమెరికాపై టెర్రరిస్టులు దాడి జరిపిన తరువాత తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో బలపడ్డారు. గత నెలలో దోహాలో అమెరికా ప్రత్యేక ప్రతినిధితో ఆరు రోజులపాటు తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ చర్చలలో మంచి పురోగతి సాధించామని ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా ప్రత్యేక ప్రతినిధి కలీం జార్జ్‌ తెలిపారు. ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలను తయారుచేశామని, ఒప్పందం కుదిరేముందు ఆ విషయాలను వెల్లడిస్తామని చెప్పారు. అవసరమైన విధంగా స్పందించేందుకు తాలిబన్లు కట్టుబడివున్నట్టు తమకు విశ్వాసం ఏర్పడిందని అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూప్‌లకు తాలిబన్లు ఒక వేదికగా ఉపయోగపడకుండా నిరోధించేందుకు వీలుకలుగుతుందని ఆ ప్రతినిధి వెల్లడించారు.

గత సెప్టెంబరులో ఖలీల్‌ జార్జ్‌ని ప్రత్యేక ప్రతినిధిగా నియమించిన తరువాత 17 ఏళ్లుగా జరుగుతున్న అంతర్యుద్ధాన్ని ముగించేందుకు వివిధ గ్రూప్‌లతో చర్చలు జరుపుతున్నారు. ఈ కాలంలో అమెరికాకు చెందిన దాదాపు 3వేల మంది సైనికులు మృతిచెందారు. రష్యాతో కూడా చర్చలు జరుగుతున్నాయని, ఇంతవరకు నిర్దిష్టమైన పురోగతి జరగలేదని తాలిబన్‌ ప్రతినిధి ముజాహిద్‌ చెప్పారు. తామే చొరవ తీసుకుని అమెరికాతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. చర్చల కోసం 2013లో కతార్‌ నగరం దోహాలో రాజకీయ చర్చల కోసం ఒక కార్యాలయాన్ని ప్రారంభించినట్టు కూడా ముజాహిద్‌ చెప్పారు. అయితే, ఆ సమయంలో చర్చలు జరిపేందుకు అమెరికా ఇష్టపడలేదని అన్నారు. ఇప్పుడు అమెరికా చర్చలకు అంగీకరించినందున తాము చొరవ తీసుకున్నామని చెప్పారు. బయట దేశం ఇక్కడి వ్యవహారాలలో ఎలాంటి పాత్ర నిర్వహించే అవకాశంలేదని ముజాహిద్‌ అన్నారు.