వైఎస్‌ వివేకానంద రెడ్డి భౌతిక కాయానికి కన్నీటి నివాళి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి భారీగా జనం తరలివచ్చారు. ‘అజాత శత్రువు’ను కడసారిగా చూసేందుకు బంధువులు, సన్నిహితులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. సజల నేత్రాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. ఊహించని దారుణంతో వైఎస్సార్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి పార్థీవదేహం వద్ద ఈ ఉదయం కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. తర్వాత అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వైఎస్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు పులివెందులలో భారీగా భద్రతా బలగాలను మొహరించారు.