రీపోలింగ్‌ లో తగ్గిన ఓటింగ్ శాతం

సాంకేతిక కారణాలు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలో రెండు చోట్ల రీ పోలింగ్‌ సోమవారం ముగిసింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం భారీ బందోబస్తు నడుమ పక్రియ పూర్తయింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్ప 197 పోలింగ్‌ కేంద్రం, కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఇసుకపల్లిలోని 41వ పోలింగ్‌ కేంద్రంలో ఏప్రిల్‌ 11న జరిగిన సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం కంటే ఈ సారి తక్కువ నమోదు కావటం గమనార్హం.

ప్రస్తుతం రీపోలింగ్‌ కేవలం పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినది కావటంతో ఓటర్లు పూర్తి స్థాయిలో ఆసక్తి చూపలేదు. సాధారణ ఎన్నికలకు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు ఓటు హక్కు వినియోగించుకోటానికి వచ్చారు. ప్రస్తుతం రీపోలింగ్‌ పట్ల అంతగా ఆసక్తి చూపలేదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల సంఖ్య తగ్గటంతో పోలింగ్‌ శాతం కొంత మేర తగ్గి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటకానితిప్పలో ఏప్రిల్‌ 11న 92 శాతం పోలింగ్‌ నమోదైతే.. రీపోలింగ్‌లో 84.22 శాతమే నమోదైంది. ఇస్కపాలెంలో గత ఎన్నికల్లో 76.65 శాతం పోలింగ్‌ నమోదైతే ఇప్పుడు 75.55 శాతం నమోదైంది. సగటున 79.88 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఓటర్లు బారులు తీరారు

జిల్లాలో నిప్పులు కురిపించే ఎండలు.. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు ఉంది. ఇలాంటి సమయంలో పోలింగ్‌కు వస్తారా? అనే సందేహం నేతలు, అధికారుల్లో వ్యక్తమైంది. వేసవి ప్రభావం పోలింగ్‌పై ఉంటుందని భావించారు. ఓటర్లు మాత్రం ఉదయం నుంచి బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రీపోలింగ్‌కు భారీ బందోబస్తును పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. తీవ్ర ఎండల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల దగ్గర తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎండతో ఇబ్బంది పడకుండా ఉండటానికి షామియానాలు ఏర్పాటు చేశారు.

గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర సాంకేతిక సహాయకులను ఉంచారు. రెండు చోట్ల ఈవీఎంలు ఎలాంటి సాంకేతిక సమస్య లేకుండా పనిచేశాయి. ఎన్నికల పక్రియ మొత్తాన్ని ఆర్వోలుగా ఉన్న జిల్లా కలెక్టర్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ పర్యవేక్షించారు. కలెక్టర్‌ ఆర్‌ ముత్యాలరాజు నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోని ఇసుపల్లి పోలింగ్‌ కేంద్రంలో జరుగుతున్న రీపోలింగ్‌ పక్రియను కార్యాలయంలోని వెబ్‌ కెమేరా ద్వారా పర్యవేక్షించారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని అటకానితిప్ప పోలింగ్‌ పక్రియను జిల్లా సంయుక్త కలెక్టర్‌ వెట్రిసెల్వి డీఆర్‌డీఏ కార్యాలయం నుంచి పర్యవేక్షించారు.