జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ క్లీన్‌చిట్‌ తో నిరసనకు దిగిన మహిళా హక్కులు

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌కి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో మహిళా హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు నిరసనకు దిగారు. అంతర్గత విచారణ కమిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. సీజేఐపై వచ్చిన ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు. అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను ఫిర్యాదుదారు అయిన మాజీ ఉద్యోగినికి అందించాలన్నారు. ఈ ఆందోళనలతో రంగంలోకి దిగిన పోలీసులు 30 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద 144 సెక్షన్‌ విధించారు.

సీజేఐ రంజన్‌ గొగొయ్‌పై మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ.. జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌కి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆయనపై చేసిన ఆరోపణలకు ఆధారాల్లేవని, వ్యాజ్యంలో పస లేదని కమిటీ పేర్కొంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయబోవడం లేదని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ కార్యాలయం పేరుతో నోటీసు విడుదలైంది.