”మహిళ చార్టర్‌ డిమాండ్స్‌” ను విడుదల చేసిన మహిళా సంఘాలు

మహిళా హక్కులు, వారు ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారాలను రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోల్లో చేర్చాలని వివిధ మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహిళ సంఘాల నేతలు ”మహిళ చార్టర్‌ డిమాండ్స్‌” విడుదల చేశారు. ఐద్వా, ఎఐడిఎంఎఎం, ఎఐఎంఎస్‌ఎస్‌, ఎఐపిడబ్ల్యుఎ, ఎండబ్ల్యుఎఫ్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, పిఎంఎస్‌, గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌ తదితర సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐద్యా ప్రధాన కార్యదర్శి మరియం థావలే మాట్లాడుతూ దేశంలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ ఉపాధి కల్పన జరిగిందని, మహిళల ఉపాధి మరింత దిగజారిందని పేర్కొన్నారు. అసంఘటిత రంగంపెరిగిందని, అందులో మహిళలకు హక్కులు లేకుండా పోయిందని అన్నారు.

బయో మెట్రిక్‌ విధానం పూర్తిగా విఫలమైందన్నారు. దీనిపై ఐద్వా, ఇతర మహిళ సంఘాలు ఆందోళనలు చేశామని తెలిపారు. మనిరేగాకు నిధులు విడుదల చేయలేదని, ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ఉజ్వల గ్యాస్‌ సిలిండర్‌ నిలిపివేసేందుకు కుట్ర పన్నుతుందని, సబ్సిడిలను ఎత్తివేసేందుకు ప్రయత్నం జరుగుతుందని, అందులో భాగంగానే గ్యాస్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు నేత రుస్తా మాట్లాడుతూ దేశంలో మతోన్మాద విద్వంసం సృష్టిస్తున్నారని, గోరక్షక్‌ పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు పెరుగుతుంటే మోడీ సర్కార్‌ నిద్రపోయిందని దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో ఎఐఎంఎస్‌ఎస్‌ నేత రితూ, పిఎంఎస్‌ చాయా, ఐద్వా నేతలు మొమునా మొల్లా, ఆశాశర్మ తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్లలో కొన్ని
శ్రీ మహిళ రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలి.
శ్రీ పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడో వంతు సీట్లు కేటాయించాలి.
శ్రీ స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
శ్రీ సార్వత్రిక . ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలి.
శ్రీ ప్రతి కుటుంబానికి 35 కేజీల ఆహార పదార్ధాలు ఇవ్వాలి.
శ్రీ పెట్రోల్‌, డిజిల్‌ ధరలు తగ్గించాలి.
శ్రీ సబ్సీడి గ్యాస్‌ ఇవ్వాలి.
శ్రీ ఐసిడిఎస్‌, ఎండిఎంఎస్‌లను బలోపేతం చేయాలి.