సౌదీలో చిక్కుకున్న భారతీయులు

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మరోసారి ఏజెంట్ల చేతిలో మోసపోయారు. మంచి కంపెనీలో ఉద్యోగాలకు పంపిస్తామని చెప్పి, గుర్తింపులేని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో తాత్కాలిక పద్ధతిలో చేర్పించడంతో… ఆ యువకులు దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఐదు నెలలుగా జీతా ల్లేక.. పాస్‌పోర్టులు కంపెనీ యాజమాన్యం చేతిలో చిక్కుకోగా.. నరకం చూస్తున్నారు.

ఇచ్ఛాపురం, కంచిలి మండలాలతోపాటు సరిహద్దు ఒడిశా రాష్ట్ర పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన పదిమంది యువకులు ఇచ్ఛాపురం పట్టణంలో రాజా ప్యాలెస్‌ ఎదురుగా నడుస్తున్న ఒక వెల్డింగ్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం ద్వారా పది నెలల క్రితం కువైట్‌లో ‘గల్ఫ్‌టెక్‌ కంపెనీ’లో వెల్డర్, ఫిట్టర్‌ ఉద్యోగాలకు వెళ్లారు. ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యానికి ఒక్కొక్కరూ రూ.65 వేల నుంచి రూ.75 వేల వరకు చెల్లించి పది నెలల క్రితం ఉద్యోగాల్లో చేరారు. వీరికి ఇండియన్‌ కరెన్సీ ప్రకారం నెలకు రూ.30 వేల జీతం.

మొదటి నెల నుంచే జీతం ఇచ్చేందుకు కంపెనీ యాజమాన్యం మొరాయించేది. మొత్తమ్మీద ఐదు నెలలు ఎలాగోలా గడిచాయి. తర్వాత తమకు జీతాలు చెల్లించలేదని బాధిత యువకులు వాపోతున్నారు. జీతం ఇచ్చి పనిచేయించుకోవల్సిందిగా బతిమాలినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. చివరికి తమ ను ఇండియాకు పంపించాల్సిందిగా కోరినప్పటికీ ససేమిరా అంటున్నారని, తమ పాస్‌పోర్టులు వారి వద్ద భద్రపర్చుకొని ఇలా ఏడ్పిస్తున్నారని యువకులు వాపోతున్నారు.