విదేశీ విద్యార్థుల ఆర్థిక కష్టాలకు వెసులుబాటుగ ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలకి అనుమతి

కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడ్డ సంక్షోభంతో ఆర్థికంగా ఇబ్బందిపడే విదేశీ విద్యార్థులు ఇక ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగం చేసుకునే వీలును కల్పిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇలా ఇబ్బందిపడే విద్యార్థులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో భారత్‌తోపాటు విదేశాలకు చెందిన వేలమంది విద్యార్థులకు ఉపశమనం కలిగినట్లే.

ఊహించని విధంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో విశ్వవిద్యాలయాలు మూతపడడంతో ప్రజలందరూ వారి నివాసాలకే పరిమితయ్యారు. ఈ సమయంలో విద్యార్థులకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఆగిపోవడం, అంతర్జాతీయ కరెన్సీ మారకపు విలువలు పడిపోవడం, ట్యూషన్‌ ఫీజులు, నివాస ఖర్చులు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదర్కొంటున్నారు. ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే విదేశీ విద్యార్థులు క్యాంపస్‌లో పనిచేయడానికి వీలు కల్పిస్తున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ప్రకటించింది.

ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో క్యాంపస్‌ పరిధిలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది. ఒకవేళ మీ అభ్యర్థనను USCIS అనుమతించినట్లయితే ఒక సంవత్సరం పాటు క్యాంపస్‌ ప్రాంగణంలో ఉద్యోగం చేసుకోవడానికి వీలుంటుంది.