నెల్లూరు యువకుడిపై అమెరికాలో కాల్పులు

నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం లింగంపల్లికి చెందిన డేగా ధీరజ్‌రెడ్డి(28) తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. ధీరజ్‌ ఉదర భాగం ఎడమ వైపు నుంచి శరీరంలోకి ప్రవేశించిన బుల్లెట్ కుడి వైపున పేగు, కాలేయాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం వెంటిలేటర్‌ మీద ఉన్న అతడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

శరీరంలో బులెట్‌ ఇంకా అలాగే ఉండిపోవడంతో శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ధీరజ్‌ రెడ్డి హార్ట్‌ బీట్‌, బీపీ లెవల్స్‌ గత రాత్రితో పోలిస్తే సాధారణంగా ఉండడంతో అతడు త్వరగా కోలుకుంటాడని మిత్రలు ఆకాంక్షిస్తున్నారు.

ధీరజ్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మమ్మ ఇంటిలో పెరిగి బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని రోజులు బెంగళూరులో ఉద్యోగం చేసి తరువాత ఉన్నత చదువుల కోసం ఈ ఏడాది జనవరిలో అమెరికాలో వెళ్లాడు. అక్కడ ఛార్లెస్టోన్‌ ఈస్ట్రన్‌ ఇలినోయిస్‌ యూనివర్శిటీలో కోర్సులో చేరాడు.